Friday, June 27, 2014

గుండెకి బలం - విభాత మిత్ర

కాలం మారుతున్న కొద్దీ మనుషులకు రకరకాల కొత్త రోగాలు పుట్టుకు వస్తున్నాయి...అహ.. నేనుచెప్పేది ఇప్పటి కొత్త పోకడల గురించి కాదు, శారీరిక రుగ్మతల గురించి. దీనికి ముఖ్య కారణం మనమే.! ఆరోగ్యం విషయంలో మనం రెండు రకాలుగా భ్రష్టు పడుతున్నాము.
 
ఒకటి, భౌతికంగా మన అలవాట్లు, జీవన పద్దతులు, పర్యావరణ కాలుష్యాలు. వీటివలన మన ఆరోగ్యం ఎంతగా ప్రభావితం అవుతున్నదో ఈ మధ్య అందరికీ అవగాహన పెరిగింది, కాని, ఈ సమస్యలను అరికట్టడానికి మనం చేపడుతున్న కార్యక్రమాలు అంతంతమాత్రమే.

రెండోది, మొదటిదాని కన్నా ముఖ్యమైనది, ఇది ఎవరికీ తెలియకుండా చాపకింద నీరులా మనలను పీడిస్తున్నది, అదే, మానసిక అనారోగ్యము. మన శారీరిక ఆరోగ్యం పై మనో వ్యాధుల ప్రభావం అంతా ఇంతా కాదు. శారీరకంగా ఎంతో ఆరోగ్యవంతులైన వారు కూడా ఒక్క మానసిక సమస్య వస్తే ఎంతగా కుంగిపోయి అనారోగ్యం పాలవుతారో మనకు తెలియంది కాదు.
ఈ మానసిక అనారోగ్యానికి ముఖ్య కారణం, మన ఆలోచనలే.

పెద్దలు చెప్పిన అరిషడ్వర్గాలు, అంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ( lust & longing, anger, miserly atittude, desires, arrogance & ego and jealousy ) మనకు శత్రువులు. ఎందుకంటే, వీటిలో ఏ ఒక్కదానికి లోబడినా, మన ఆలోచనలు తప్పుదారి పడతాయి. మనకు కొత్త కోరికలను పుట్టిస్తాయి. ఆ కోరికలు మంచివా కావా అన్న విచక్షణా జ్ఞానాన్ని ఈ అరిషడ్వర్గాలు నశింపజేసి, కావలసినది పొందే వరకు మనచేత ఏ పనైనా చేయిస్తాయి. ఆ పనుల వలన ఎందరికి ఎన్ని కష్టాలు, మనస్తాపాలు కలిగిస్తున్నామో తెలుసుకోవడం చాలా కష్టం. కొందరు తెలుసుకున్నా, గర్వంతో వాటిని లెక్క చేయరు.

మీకు కష్టం కలిగించిన ఏ సన్నివేశంలోనైనా, జాగ్రత్తగా పరిశీలించి చూడండి, పై చెప్పిన అరిషడ్వర్గాలలో ఏదో ఒకటికానీ, ఒకటి కన్నా ఎక్కువ కానీ దానికి కారణమై ఉంటాయి.

ఇతరులకు ఎప్పుడైతే కష్టమవుతుందో, దానర్థం మనము వారికి ఒక చెడు శక్తిని ప్రవహింపజేశామని. మననించి బయటికి , ఇతరులకు వెళ్ళిన ఏ శక్తి అయినా, మంచిది కానీ చెడు కానీ, అది మనకే తిరిగి వస్తుంది. ఆ వచ్చేది రెట్టింపో, మూడురెట్లో, పదిరెట్లో అయి వస్తుంది. అలా తిరిగి వచ్చిన చెడుశక్తి మనకు కీడే కలిగిస్తుంది తప్ప ఎంత మాత్రమూ మేలు చేయదు. ఆ చెడు శక్తి మన శరీరంలో ఉన్న శక్తి చక్రాలను ( ఈ చక్రాలనే ’ ఎనర్జీ సెంటర్స్ ’ అంటారు) నిర్వీర్యం చేసి, ఆయా చక్రాలను అచేతనంగా మారుస్తాయి. ఒక్కో చక్రం వలన మనకు రావలసిన ప్రయోజనాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఉదాహరణకి, మూలాధార చక్రం వలన శరీర ఆరోగ్యం, దారుఢ్యం, అలాగే అలౌకిక శక్తులు ఉత్తేజితం అయి, వాటి వాటి ఫలితాల వలన మనం లబ్ధి పొందడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం అజ్ఞానంతో సృష్టించిన చెడుశక్తి మనలను వెంటాడుతుందో, అప్పుడు ఆయా ఫలాలను మనం కోల్పోయి భ్రష్టులమవుతాము.

ఐతే , మన సంకల్పము మంచిదై, మంచి కోరిక ఉన్నప్పుడు కూడా అది ఇతరులకు ఒకోసారి కష్టం కలిగిస్తుంది. ఎందుకంటే అది వారిలో అహంకారాన్నో, మోహాన్నో, దెబ్బతీయ వచ్చు, వారిలో అసూయ( మాత్సర్యం ) ను పెంచ వచ్చు. అది మన తప్పు కాదు. అందుకు స్పందించి వారేమైనా వ్యతిరేకంగా చేస్తే, అది వారి తప్పు అవుతుంది.

మన వలన ఒకరికి చెడు శక్తి వెళ్ళినపుడు, అది తిరిగి వచ్చి, మనలని మళ్ళీ ఇంకా పెద్ద తప్పు చేసేలా చేస్తుంది. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. దీని వలన మన మనసు, శరీరం, రెండూ ప్రభావితం అవుతాయి. దీన్ని ఆపడానికి, మన చెడు ఆలోచనలను నిరోధించాల్సి ఉంటుంది. దానికి కొన్ని సాధనలు చేయాల్సి ఉంటుంది.

మనో వేదనకు భౌతికమైన ఔషధాలు పనిచేయవు . అందుకే మనో వేదనకు మందు లేదు అంటారు. కానీ దానికి ఉన్న చికిత్స వేరు.
మనం ఈమధ్య తరచూ వింటున్న ప్రాణాయామం, ధ్యానం, యోగా వంటివి మనం చేయాల్సిన సాధనలు. వీటిని అభ్యాసం చేసిన వాళ్ళు " మనమంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్ళము, ఒక మనిషికి, ఇంకో మనిషికి భేదాలు లేవు, ఇతరులకు మంచి చేస్తేనే మనకు సంతోషము " వంటి నిజాలను అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. " నేను, నాది " అన్న భావము నశిస్తుంది. అప్పుడు, ఇతరులకు మనం హాని చేసే ప్రసక్తే రాదు. వీటిద్వారా మన మనసు మన కంట్రోలులో ఉంటుంది.

ఇది చెప్పితే అర్థమయ్యేది కాదు, అభ్యాసము చేస్తే గానీ తెలియదు.

సులభంగా ధ్యానము చేసే పద్దతి తరువాతి పేజీలలో చూడగలరు.

ఇప్పుడు కొన్ని ఆరోగ్య సాధనలు చూద్దాం

ఇవ్వాళా రేపూ ఏ వయసు వారిని చూసినా హృద్రోగాలు ( heart problems ) ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుండెజబ్బును భరించడం ఒక ఎత్తయితే, దాని చికిత్స కు అయ్యే ఖర్చులు, రోగికి, సమీప బంధువులకు అయ్యే అసౌకర్యము, రోగి పడే మానసిక వ్యథ, ఇతరులు పడే బాధ ఇవన్నీ ఇంకో ఎత్తు.
ఇవన్నీ తప్పించే తరుణోపాయం ఏమిటంటే, హృద్రోగాలు రాకుండా చూసుకోవడం.

prevention is definitely better than cure
అది అంత సులభమా ? తెలియని వాళ్ళకి కష్టమే. అదేమంత బ్రహ్మ విద్య కాదు. . నమ్మలేరా ? ’ అభ్యాసం కూసు విద్య ’ అన్నారు మరి!

ఈ కింద చెప్పినట్టు రోజుకు కనీసం 10--15 నిమిషాలు చేస్తే, ఏ గుండె జబ్బులూ రావు.
రోజూ మాకు టైము దొరకదు అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు టైము దొరకక పోతే, తరువాత అసలు మన టైమే ఉండదన్న సంగతి మరువ రాదు. ఆరోగ్యాన్ని మించి ఇంకేదీ లేదు. ఇంకొందరేమో, మాకు ఏ జబ్బూ లేదు, గుండె జబ్బు వచ్చాక చూద్దాం లే, అంటారు. ఒకసారి గుండెజబ్బు వచ్చాక చేసేవి కావివి. రాకముందే చేస్తేనే రాకుండా నిరోధించగలం.

ఇవి ప్రాచీన కాలం నుండీ మన పూర్వీకులు పాటిస్తున్నవి. వీటినే ఈ మధ్య విదేశీయులు కాపీ కొడుతున్నారు. ఎక్కువ డబ్బులు చెల్లించి వాళ్ళదగ్గర నేర్చుకొనేది ఇంత కన్నా కొత్తగా ఏమీ ఉండదు.

ఇష్టమైన వాళ్ళు ఇలా చేయండి.

పొద్దున్నే లేచాక, కాలకృత్యాలు తీర్చుకొని, పరగడుపున, అంటే, ఖాళీ కడుపుతో ఇది చేయాలి. స్నానం ముందైనా, తరువాతైనా చేయవచ్చు, మీ అనుకూలం కొద్దీ. ఇందులో 12 మెట్లు ఉన్నాయి ( steps ) ప్రతి మెట్టు తర్వాతా, మీ గుండెకు మంచిబలం చేకూరుతుంది. ఈ విషయాన్ని ప్రతిమెట్టు తర్వాతా మీరు గుర్తుచేసుకోవాలి.

౧. మార్జాలాసనము

ఇది చాలా తేలికైన ఆసనము. ఒక చాప కానీ, జంఖానం కానీ పరచి, దానిపైన మోకాళ్ళ మీద కూర్చొని, ముందుకు వంగి, అర చేతులు నేలపై పెట్టి, భారం చేతులపై మోపాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు, మెడ, తల పూర్తిగా పైకెత్తి, అర చేతులు మాత్రం ఎప్పుడూ నేల పైనే ఉంచాలి. శ్వాస బిగించే అవసరం లేదు. తర్వాత, శ్వాస మెల్లగా వదలాలి. ఇలా శ్వాస వదలుతున్నప్పుడు, మెడ, తల కిందికి పూర్తిగా వంచి, నడుముని పిల్లి వంచినట్లు, పైకి, ఒక ఆర్చి లాగా వంచాలి. ఇలా10 సార్లు శ్వాస పీలుస్తూ, వదలుతూ, తల, మెడ లను పైకి, కిందికీ ఎత్తుతూ వంచుతూ ఉండాలి. అర చేతులు మాత్రం ఎల్లప్పుడూ నేలపై ఉండాలి.
మీ గుండెకు మంచి బలం చేకూరింది , గుర్తుచేసుకున్నారా?

౨. వజ్రాసనము

ఇది ఇంకా సులభమైనది. మోకాళ్ళమీద కూర్చొని, మోకాళ్ళు రెండూ ఒకదానికొకటి తగులునట్లు ఆనించి, చేతులు రెండూ తొడలపై పెట్టి, తల కాస్త పైకెత్తి, సూటిగా చూడాలి. పాదాలు రెండూ పిరుదుల కింద, వెల్లకిలా, అంటే, అరికాళ్ళు పైకి వచ్చేలా పెట్టాలి. రెండు కాళ్ళ బొటన వేళ్ళూ ఒకదానికొకటి తగలవచ్చు., లేదా, క్రాస్ చేసుకోవచ్చు. ఈ భంగిమ నే వజ్రాసనము అంటారు. అలా ఒక 3--5  సెకెండ్లు ఉండాలి.
మీ గుండెకు మంచి బలం చేకూరింది , గుర్తుచేసుకున్నారా?

౩. అనులోమ విలోమ ప్రాణాయామము.

పేరు చూసి భయపడకండి. ఈపేరు చదివే టైము లోనే ఇది చేసేయొచ్చు. మరేంలేదు, ఇది కేవలం శ్వాస తీసుకొని వదలడమే, ఒక పద్దతిగా !.
నేలపై సుఖాసనం లో కూర్చొని, మొదట మామూలుగా దీర్ఘ శ్వాస తీసుకొని, ముక్కు ఎడమ వైపునుండి నిదానంగా వదలాలి. తర్వాత, ఎడమ వైపు నుంచే, దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు, కుడివైపునుంచి శ్వాస నిదానంగా వదలాలి. కుడివపునుంచే మళ్ళీ శ్వాస తీసుకోవాలి.
ఇలా ఒకసారి ఎడమవైపునుంచి దీర్ఘ శ్వాస వదిలి తీసుకోవడం, తర్వాత కుడివైపునుంచి వదలి తీసుకోవడం. ఇలా 10 సార్లు చేయాలి. శ్వాస పీల్చిన తర్వాత బిగపట్టే అవసరం లేదు.
మీ గుండెకు మంచి బలం ........, గుర్తుచేసుకున్నారా?

౪. భుజావృత్తి

మొదట పైన చెప్పిన వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత, కుడి చేతివేళ్ళతో కుడి భుజాన్నీ, ఎడమచేతి వేళ్ళతో ఎడమ భుజాన్నీ పట్టుకొని, వేళ్ళు మాత్రం పైకి తీయకుండా అలాగే పెట్టి, మోచేతులని బాగా పైకెత్తి, గుండ్రంగా తిప్పాలి. మొదట సవ్యదిశలోను, తర్వాత అపసవ్య దిశలోనూ 10 సార్లు తిప్పాలి. చేతి వేళ్ళు భుజాలను పట్టుకొనే ఉండాలి.
మీ గుండెకు ......., గుర్తుచేసుకున్నారా?

౫. ప్రాణాయామం

ఇప్పుడు కుడిముక్కుని గట్టిగా మూసి, ఎడమ ముక్కు నుండి గాలిని దీర్ఘంగా పీల్చాలి. ఇలా పీలుస్తున్నప్పుడు, ఎడమ ముక్కు పుటాన్ని లోపలికి లాగితే, శ్వాస తీస్తున్న శబ్దం వస్తుంది. అలాగ శబ్దం వచ్చేలా పీల్చాలి. తర్వాత ఎడమ ముక్కుని గట్టిగా మూసి, కుడివైపునుండీ గాలి నిదానంగా వదలాలి. ఇలా వదిలేటప్పుడు ఎలాంటి శబ్దమూ చేయరాదు. ఇలాగ 10 సార్లు చేయాలి.
మీ గుండెకు ......., గుర్తుచేసుకున్నారా?

౬. భస్త్రికా ప్రాణాయామం.

పేర్లు చూసి ఎప్పుడూ భయపడరాదు.అని ఇది చేశాక మీరే చెపుతారు. ఇందులో ముక్కు మూసే పనిలేదు, శబ్దాలు చేసే పనీ లేదు. మామూలుగా, కళ్ళు మూసుకొని, దీర్ఘం గా శ్వాస తీసుకొని అంతే దీర్ఘంగా శ్వాస వదిలెయ్యాలి. మధ్యలో శ్వాస బిగించే అవసరం లేదు. ఇలా 10 సార్లు చెయ్యండి.
గుర్తుచేసుకున్నారా?

౭. అంగుళీ ప్రాణాయామం.

రెండు బొటన వేళ్ళనీ రెండు చెవుల్లోపల పెట్టుకోండి. రెండు చూపుడు వేళ్ళనీ నుదుటిపైన పెట్టుకోండి. మిగిలిన కుడిచేతి 3 వేళ్ళతో కుడి కన్ను మూయండి. అలాగే, మిగిలిన ఎడమచేతి  3  వేళ్ళతో ఎడమ కన్ను మూయండి.
ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస బిగించి, అతి నిదానంగా , ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు దీర్ఘంగా శ్వాస వదలాలి. ఇలా వదులుతున్నప్పుడు, పెదాలు గట్టిగా మూసి, " మ్ మ్ " అంటూ శబ్దం చేస్తూ ఉండండి. ఇలా ఒకసారి చేస్తే చాలు.

౮. ప్రణవమ్

ఓంకారాన్ని బొడ్డులోనుంచి మొదలుపెట్టి అతి నిదానంగా పైకి వినిపించేటట్టు జపించండి. రెండు సార్లు చాలు.

౯. మానసిక విశ్రాంతి

మానసికంగా ఏ ఆలోచనలూ లేక, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి.ఇది చెప్పినంత సులువు కాదని అంటారా ? సరే, దానికీ ఓపద్దతి , తర్వాతి స్టెప్ చూడండి.

౧౦. శవాసనం

ఇది అనుకున్నంత సులభం కాదు. శవాసనం అంటే ఏ కదలికా లేకుండా శవం లాగా పడుకొని ఉండడం మాత్రమే కాదు, మానసికంగా పూర్తిగా రిలాక్స్ కావాలి.
ఇలా చేయండి,
కళ్ళు మూసుకుని, వెల్లకిలా పడుకొని, శరీరంలో ఏ భాగమూ వత్తిడి లేకుండా ఉండునట్లు చూసుకోండి. తర్వాత, కాలి వేళ్ళ మీద మానసికంగా దృష్టి పెట్టీ, కాలి వేళ్ళు పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్టు ఊహించుకోండి. తర్వాత, పాదాలు, మడమలు, కాళ్ళూ ఇలా ఒక్కొక్క భాగాన్ని రిలాక్స్ అవుతున్నట్టు ఊహించుకోండి. ఇలాగే, తొడలు, నడుము, పొట్ట, నడుము మీదుగా గుండె, మెడ, తల అన్నీ పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్టు ఊహించుకోండి. ఇలా ఒకసారి కిందనుంచి పైకి పూర్తిగా కవర్ చేశాక, రెండోసారి మళ్ళీ కాలి బొటనవేళ్ళనుంచీ మొదలు పెట్టి మళ్ళీ తలవరకు రండి. శరీరంలో ఒక్కొక్క అంగుళమూ రిలాక్స్ అవుతున్నట్టు హడావుడి లేకుండా నింపాదిగా ఊహిస్తూ మొత్తం శరీరం రిలాక్స్ అయినట్టు ఊహించండి. నిజంగానే శరీరం అంతా ఏ నొప్పులున్నా, ఏ స్థితిలో ఉన్నా, పూర్తిగా రిలాక్స్ అవుతుంది. ఇలా రెండోసారి చేస్తున్నప్పుడు, ఆయా భాగాలు ఒకవిధమైన చక్కిలిగిలి లేదా రోమాంచితము లోనవుతాయి.
మూడవసారి మళ్ళీ బొటనవేళ్ళనుండీ తల వరకూ ఇదే విధంగా రిలాక్స్ అవుతున్నట్టు ఊహించాలి. ఇప్పుడు శరీరం చాలా తేలికగా అవుతుంది. అసలు మన శరీరం ఉందా లేదా అన్న ఫీలింగు కలుగుతుంది. ఇంకాసేపటికి, శరీరం గాలిలో తేలుతున్న అనుభూతి వస్తుంది. మన కాళ్ళు ఏ దిక్కున ఉన్నాయో, తల ఏ దిక్కున వుందో కూడా మనకు తెలీదు. శరీరం మెల్లగా గుండ్రంగా గాలిలో తిరుగుతున్నట్టు అవుతుంది. కొంతమందికి ఇప్పుడు నిద్ర వచ్చినా ఆశ్చర్యం లేదు.
శవాసనం అంటే ఇదంతా అనుభూతిలోకి రావాలి. కేవలం హృద్రోగానికే కాకుండా, ఈ శవాసనం మన మనసులు పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకు కూడా చేయవచ్చు. ఇదయ్యాక, ఎంత ఫ్రెష్ గా ఉంటుందో, అభ్యాసం చేసిన వాళ్ళకే తెలుస్తుంది. కొంతమందికి ౫ సార్లు చేస్తేగాని ఇది అనుభవానికి రాక పోవచ్చు. ’ సాధనమున పనులు సమకూరు ధరలోన ’అని ఊరికే చెప్పలేదు.

౧౧. హాసం ( వవ్వడం )

ఈ కాలం ఇది చాలా కష్టమైన పనిగ తోస్తుంది. మనస్పూర్తిగా అన్నీ మరచిపోయి, అందర్నీ మరచిపోయి, పరిసరాలను మరచిపోయి మీరు నవ్వి ఎంతకాలం అయ్యింది ? అంతగా నవ్వు రాకపోతే, ఒక చిట్కా. ఈ మధ్య " Laughter Club " వాళ్ళు నవ్వడం T. V లో ఎప్పుడైనా చూశారా ? వాళ్ళు బలవంతాననో, ఇంకెలాగో, లేని నవ్వు తెచ్చుకొని, అంత గట్టిగా పడీ పడీ నవ్వుతుంటారుకదా, అలా కారణం లేకుండా వాళ్ళు నవ్వుతుంటే, నవ్వాలో ఏడవాలో తెలీక, చూసిన వాళ్ళకు మనకు నవ్వు రాదా? నవ్వు ఒక అంటు వ్యాధి.
నవ్వు రానపుడు అది గుర్తు తెచ్చుకోండి.

౧౨ ఆక్యు ప్రెషర్

దీనికి సూదులు అవసరం లేదు. మొదట కుడి చేతి బొటన వేలితో, ఎడమ చేతి చిటికెన వేలు కింది భాగాన్ని నొక్కాలి. అలాగే నొక్కుతూ, కిందికి వస్తూ, ఎడమ చేతి మణి కట్టు వరకూ రావాలి. అలాగే నొక్కుతూ, మెల్లగా . ఎడమచేయంతా నొక్కుతూ, ఎడమ మోచేతి వరకూ రావాలి. అలాగే, భుజం వరకూ రావాలి. మళ్ళీ వాపసు వెళ్తూ, మోచేయి, మణికట్టు దాటి మళ్ళీ చిటికెనవేలు వరకూ రావాలి. ఇలా నొక్కుతున్నప్పుడు, వేగంగా కాకుండా, మెల్లగా, నిదానంగా, ఒక్కొక్క అంగుళమూ వదలకుండా నొక్కుకుంటూ రావాలి.
తరువాత , ఇపుడు ఎడమ చేతి బొటనవేలితో, కుడి చేతి చిటికెనవేలి నుంచి మొదలు పెట్టి, భుజం వరకు వెళ్ళి, మళ్ళీ వాపసు రావాలి. ఇదే ఆక్యు ప్రెషర్.

మీ గుండెకు బలం చేరుతున్నట్టు ప్రతి స్టెప్పు తర్వాతా గుర్తుచేసుకోమన్నాను, ఏడవ స్టెప్పు తర్వాత మరిచిపోయారు కదూ ! ఫరవాలేదు, ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నారు కదా, ఈసారి మర్చిపోకండి.
పైవన్ని చేసేసరికి, అరగంట పైనే అయ్యిందా ? మీరు దీన్ని ఒకటికి పదిసార్లు చదివి, స్టెప్పులన్నీ గుర్తుపెట్టుకొంటే, 10  నిమిషాలలో చేయగలరు.
మధ్యలో ఎక్కడైనా, ఏదైనా కష్టమనిపిస్తే , వెంటనే నిలిపివేసి, కాసేపాగి, మళ్ళీ మొదలు పెట్టండి.
పైన చెప్పిన అన్ని స్టెప్పులూ నేర్చుకోవడానికే ఒక నెల పట్టినా ఫరవాలేదు.
ఒక్కొక్క స్టెప్పూ, తీరిగ్గా, నిదానంగా నేర్చుకోండి. ఇవన్నీ తొందర తొందర గా చేసేవి కావు. ఒకోసారి అన్ని స్టెప్పులూ చేయలేకపోతే మరేమీ ఫరవాలేదు, కానీ ఏరోజూ మానెయ్యకండి.

పై అభ్యాసం వల్ల, గుండెకు మంచి బలం చేకూరుతుంది. చెడు రక్తం శుభ్రమౌతుంది. కొలెస్టరాల్ తగ్గుతుంది. హార్ట్ ఎటాక్ ఛాన్స్ తగ్గిపోతుంది.
నాకు తెలిసిన heart doctor ( M.B.B.S ) ఒకాయన రోజూ ఇవన్నీ చేస్తాడు

--
విభాత మిత్ర

No comments:

Post a Comment